Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగ్ కూడా మా క్లబ్ లోకి వచ్చేశాడు... నాకు చాలా సంతోషంగా ఉంది: చిరంజీవి చమక్కులు

Chiranjeevi makes fun with Nagarjuna on Bigg Boss stage
  • బిగ్ బాస్-4 గ్రాండ్ ఫినాలే
  • చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి
  • తనదైన శైలిలో చమక్కులు
  • నాగ్ వయసుపై చమత్కారం
  • కంటెస్టెంట్లతో ఆసక్తికర సంభాషణ
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వచ్చీ రావడంతోనే హోస్ట్ నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత సీజన్ కు ఇప్పటి సీజన్ కు నాగ్ లో వచ్చిన తేడా ఏంటని అందరినీ ప్రశ్నించారు. వారు ఏ మార్పు లేదని చెప్పగా, చాలా మార్పు ఉందని చిరు అన్నారు. ఇప్పుడాయన తమ 60 ఏళ్ల వారి క్లబ్ లోకి వచ్చేశారని, తమకు ఎంతో ఆనందంగా ఉందని సరదాగా అన్నారు.

కొన్నిరోజుల కిందట నాగ్ పంపిన ఓ స్టిల్ చూసి కడుపు రగిలిపోయిందని, అంత యంగ్ గా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మీరు ఇంత నవమన్మధుడిలా ఉంటే జనాలకు నిద్రెలా పడుతుందని చమత్కరించారు. అంతేకాదు, బిగ్ బాస్ షోను తన వాక్చాతుర్యంతో అద్భుతంగా నడిపిస్తున్నాడంటూ నాగార్జునను చిరంజీవి ప్రశంసించారు.

ఇక, స్టేజ్ పైకి చేరుకున్న కంటెస్టెంట్ అభిజిత్ పైనా చిరంజీవి పంచ్ వేశారు. ఏంటి అభిజిత్ నిల్చున్నావు, నువ్వు సోఫాలో రిలాక్సవుతూ కనిపించాలి కదా అటూ ఛలోక్తి విసిరారు. అంతేకాదు, టిష్యూ పేపర్ అంశంలోనూ అభిజిత్ ను ప్రశ్నించి నవ్వులు పూయించారు.

ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ, చూసే అందరి దృష్టి నీ మీదే ఉంటుందని, అందరి ప్రే'మోనాల్ని' అంటూ పరోక్షంగా అఖిల్, మోనాల్ మధ్య ఉన్న స్నేహబంధాన్ని కూడా ప్రస్తావించారు. దాంతో మరోసారి బిగ్ బాస్ వేదిక నవ్వులతో మార్మోగింది. కంటెస్టెంట్ల మధ్య ఉన్న సొహైల్ ను చూడగానే చిరంజీవిలో వెయ్యి ఓల్టుల ఎనర్జీ వచ్చింది. కథ వేరుగుంటది అంటూ సొహైల్ తరహాలోనే డైలాగ్ చెప్పి ఉర్రూతలూగించారు. తన రాబోయే సినిమాలో కథ వేరుగుంటది అనే డైలాగ్ పెట్టుకుంటానని, అందుకు నీ పర్మిషన్ కావాలని సొహైల్ ను చిరంజీవి అడిగారు. మెగాస్టార్ అడగడమే తన భాగ్యంగా భావించిన సొహైల్ వెంటనే ఓకే చెప్పేశాడు.

ఈ సందర్భంగా చిరంజీవి మరో ఆసక్తికరం అంశాన్ని వెల్లడించారు. సొహైల్ ఓసారి హౌస్ లో మటన్ ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన విషయం తన భార్య సురేఖ గమనించిందని, అందుకే ఇవాళ నీ కోసం బిర్యానీ వండి పంపించిందని చెప్పగానే, సొహైల్ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక సొహైల్ తానో సినిమా తీస్తానని చెప్పగానే, అందరి ముందు మాటిస్తున్నాను.. నీ సినిమాలో నేను గెస్ట్ రోల్ చేస్తాను అని చిరంజీవి వెల్లడించారు.
Chiranjeevi
Nagarjuna
Bigg Boss Telugu 4
Sohail

More Telugu News